ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసేలా టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 4500కు చేరింది. ఒక్క టర్కీలోని 3వేల మందికి పైగా మంది మరణించగా.. సిరియాలో దాదాపు 15 మంది చనిపోయినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. వేలాది మంది శిథిలాల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వారి కోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ భూకంపంలో మృతుల సంఖ్య మరింత భారీగా పెరగొచ్చని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. 20వేల మందికి పైగా మరణించి ఉంటారని అంచనా వేసింది.
టర్కీ, సిరియా భూకంపాలు ప్రపంచ దేశాలను దిగ్ర్భాంతికి గురి చేశాయి. ఇప్పటికే ఈ భూకంపాలపై ప్రధాని మోదీ స్పందించారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలను కూడా పంపారు. తాజాగా ఈ విలయంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. టర్కీ, సిరియాలో సంభవించిన ప్రమాదం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని తెలిపారు.
‘టర్కీ, సిరియా భూకంపాలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఆ దేశాల్లో వేలాది మంది చనిపోయినట్లు వస్తున్న వార్తలు చూసి చాలా బాధగా ఉంది. ఇది చాలా బాధాకరమైన రోజు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Shocked to see the visuals of devastation in Turkey & Syria! Truly a very sad day for humanity
Prayers for strength & wholehearted condolences to the bereaved families 🙏#TurkeyEarthquake
— KTR (@KTRBRS) February 7, 2023