ఆంధ్రప్రదేశ్ లో నూతన వైన్స్ షాపులకు ఈనెల 14న లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే లాటరీలో షాపు వచ్చిన వారు చాలా సంతోషంలో ఉండగా.. రాని వారు కాస్త నిరాశలో మునిగిపోయారు. పలు ప్రాంతాల్లో పలువురు వ్యక్తులు సిండికేట్లుగా ఏర్పడి వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పలువురు రాజకీయ నాయకులు సైతం భారీగానే వైన్స్ షాపుల కోసం పోటీ పడ్డారనడంలో ఎలాంటి సందేహం లేదు.
నంద్యాల దివంగత మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల మద్యం షాపుల టెండర్లలో కొన్ని మద్యం దుకాణాలను దక్కించుకున్నారు. అన్నమయ్యలో 6, అనంతపురం 4, కర్నూలు 01 సహా పీలేరు లో కూడా కొన్ని షాపులను దక్కించుకోవడం విశేషం. మరోవైపు మంత్రి నారాయణ తన అనుచరుల కోసం రూ.2కోట్ల సొంత డబ్బులతో 100 మంది కార్యకర్తల ద్వారా వైన్స్ షాపులకు దరఖాస్తు చేశారు. 100 దరఖాస్తులకు మూడు షాపులు దక్కాయి. ఒక్కో షాపునకు ఆరుగురు డివిజన్ ఇన్ చార్జీల చొప్పున 18 మందికి ఆయన షాపులను అప్పగించారు. చట్టబద్దంగా వ్యాపారం చేసుకోవాలని వారికి సూచించారు మంత్రి నారాయణ. మరోవైపు కర్నాటక, ఉత్తరప్రదేశ్ కి చెందిన వారు కూడా దక్కించుకోవడం గమనార్హం.