గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ సీవీ ఆనంద్‌తో కలిసి నిమజ్జనం, శోభాయాత్ర ఏర్పాట్లను మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. చార్మినార్ నుంచి ప్రత్యేక బస్సుల్లో ఉస్మాన్ గంజ్, మోజంజాహీ మార్కెట్, ఆబిడ్స్, లిబర్టీ, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌లో ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేసే క్రేన్ నంబర్ 4 వద్దకు చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు.
శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఖైరతాబాద్ వినాయకుడి వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గణేశ్ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే అన్ని రహదారులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు అడ్డం లేకుండా తొలగించినట్లు పేర్కొన్నారు.
నిమజ్జనం సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని.. ప్రజలు సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాతబస్తీ చార్మినార్ ప్రాంతంలో పర్యటించి లంబోదరుడి శోభాయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్, మేయర్, పోలీసు కమిషనర్లు, ఇతర ప్రభుత్వాధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. చార్మినార్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు శోభాయాత్ర జరిగే ప్రదేశాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.