చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి తన్నీరు హరీష్ రావు…ఆసక్తి కర కామెంట్స్ చేశారు. మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని.. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయించారన్నారు.
చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వ కారణమని.. అన్నీ ప్రభుత్వ కార్యాలయాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నామని వివరించారు.
రానున్న రోజుల్లో ఐలమ్మ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నారు… సిద్దిపేటలో అన్ని సౌకర్యాలతో మోడరన్ దోబి ఘాట్ రజకుల సౌకర్యార్థం నిర్మించామన్నారు. రానున్న రోజుల్లో ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.