రాష్ట్రప్రభుత్వం ప్రజల వద్దకు పాలన తీసుకుపోవాలనే సదుద్దేశంతోనే ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలోని 54వ డివిజన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సందర్శించిన ఆయన జనవరి 6న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుందన్నారు.
ఇప్పటివరకు దరఖాస్తులు ఇవ్వని వారు చివరి రోజు కూడా పట్టణాల్లో అయితే వార్డు కార్యాలయాల్లో అధికారులకు,గ్రామాల్లోనైతే పంచాయతీ కార్యాలయాలలో అందజేయవచ్చన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రోజులలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని ఆయన గుర్తు చేశారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిందని అన్నారు. మిగతా పథకాల కోసం ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు.తర్వాత పలువురు దరఖాస్తుదారులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కమర్తపు మురళి, మంజుల, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.