టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ఈ ఘటనతో సంబంధం లేకపోతే మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ కంప్యూటర్ ద్వారా సమాచారం లీకైనా.. దానికి కేటీఆర్ నైతిక బాధ్యత వహించాలని అన్నారు. పేపర్ లీకేజీ ఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్నారని రఘునందన్ వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది ఎన్నికలు వస్తున్నందునే కేసీఆర్‌కు రైతులపై ప్రేమ పొంగుకొస్తుందని రఘునందన్ రావు విమర్శించారు. నిజంగా రైతులను ప్రభుత్వం ఆదుకుంటామంటే బీజేపీ ప్రభుత్వం స్వాగతిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య ఎంతో వ్యవసాయ శాఖ కమిషనర్ శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరు ఎకరాలు దాటిన రైతులకు ఈ ఏడాది రైతుబంధు రాలేదని చెప్పారు.
తండ్రి మాదిరి.. కుమారుడు జర్నలిస్టులను తిట్టడం అలవాటుగా మారిందని ఎమ్మెల్యే రఘునందన్ దుయ్యబట్టారు. పేపర్ లీకేజీపై సంబంధం లేకుంటే విద్యాశాఖ మంత్రి మాట్లాడకుండా కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. రాజు తర్వాత యువరాజుగా ఫీల్ అవుతున్నాడు కాబట్టే.. కేటీఆర్‌ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.