తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. వీలైనంత త్వరగా షోకాజ్ నోటీసులపై సమాధానం ఇస్తానని తెలిపారు. తన వివరణతో పార్టీ సంతృప్తి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ తనను వదులుకోదని అనుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తనకు పూర్తి నమ్మకముందని అన్నారు.
తాను చేసిన వీడియోలో ఏ మతాన్ని కించపరచలేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. కోర్టు పరిమితుల దృష్ట్యా ఎక్కువగా మాట్లాడలేదని తెలిపారు. మిగతా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కుంటానని చెప్పారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్‌పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయణ్ని అరెస్టు చేయగా.. బెయిల్‌పై విడుదలయ్యారు.
రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలపై నగరమంతా కోపోద్రిక్తమైంది. ముఖ్యంగా పాతబస్తీలో ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అర్ధరాత్రి పూట పాతబస్తీలో ప్రజలు ఆందోళనకు దిగారు. భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ పాతబస్తీలో పరిస్థితులు టెన్షన్ టెన్షన్‌గానే ఉన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు రాజాసింగ్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.