గుంటూరు, కృష్ణా జిల్లాల వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులు అమరావతికి మద్దతుగా నిలబడి పదవులకు రాజీనామా చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రజల కన్నా పదవులే ముఖ్యం అనుకుంటే వారి రాజకీయ భవిష్యత్‌కు సమాధి తప్పదన్నారు. గతంలో జగన్‌ని నమ్మి ఎంతమంది రాజకీయనాయకులు, అధికారులు జైలుపాలయ్యారో గుర్తుతెచ్చుకోవాలని హెచ్చరించారు. ఇప్పుడు మళ్లీ సీఎం జగన్‌ని నమ్మి రాజకీయ సన్యాసులు ఎందుకు అవుతారని నిలదీశారు. తమ ఆశల్ని, ఆకాంక్షాలని నెరవేరుస్తారని నమ్మి ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకున్నారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం రైతులు వైపు నిలబడతారో.. లేక పదవుల కోసం ప్రజలకు ద్రోహం చేసినవారిగా చరిత్రలో నిలుస్తారో.. తేల్చుకోవాలని స్పష్టంచేశారు. నమ్మక ద్రోహులను, నయవంచకులును రాష్ట్ర ప్రజలు క్షమించరన్న విషయం వారు గుర్తుంచుకోవాలని అనగాని ఆక్షేపించారు.
టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో గత కొంత కాలంగా అనేక గుసగుసలు వినిపించాయి.అనగాని సత్యప్రసాద్ అధికార పార్టీ లోకి వెళ్లిపోతున్నారని చాలా ఎక్కువగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అనగాని చేసిన వ్యాఖ్యలు చూస్తే అవన్నీ ఒట్టి మాటలు గా పరిగణించవచ్చు. రాజధాని విషయంలో టిడిపి నాయకులు అందరూ ఒకే మాటమీద ఉంటారో లేదో చూడాలి.