అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కులాల ప్రస్తావన తీసుకొస్తూ… వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేపుతున్నాయి. హబూబాబాద్ జిల్లా కేసముద్రంలో సోమవారం ఓ చర్చిలో క్రైస్తవులకు దుస్తుల పంపిణీ సభలో ఆయన మాటలు కలకలం సృష్టించాయి. సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘‘అబ్రహం లింకన్ తండ్రి చెప్పులు కుట్టేవాడు. కష్టపడి అబ్రహం లింకన్‌ను చదివించాడు. లింకన్ కూడా కట్టెలమోపులు అమ్మి, చెప్పులు కుట్టి, బాగా చదివి… అమెరికాకు అధ్యక్షుడు అయ్యాడు. ఆ తర్వాత జరిగిన సభలో ఓ బలిసిన వాడు ఏమన్నాడంటే… ‘ఈ చెప్పులు కుట్టేవాడి కొడుకు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. వాడి నాన్నను కూడా పిలిచారా’ అని అన్నాడు.
అంటే మనిషికి మూడు బలుపులుంటాయి ఈ ప్రపంచంలో. ఏం బలుపయా అంటే.. ఒకటి నేను రెడ్డి, నేను వెలమ అనే బలుపు. ఒకటి నా దగ్గర బాగా డబ్బుందనే బలుపు. నేను బాగా చదువుకున్నా అనే బలుపు” అంటూ అందరూ షాకయ్యేలా మాట్లాడారు శంకర్ నాయక్. అంతేకాదు… ఎవర్ని కోసినా రక్తమే వస్తుందన్న ఆయన… అందరం కలిసి మెలిసి ఉండటం ముఖ్యమన్నారు. శంకర్‌నాయక్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కులాల ప్రస్తావన తీసుకురావడంతో టీఆర్ఎస్ నేతలు కూడా ఒకింత షాక్‌తో ఉన్నారు.