హారికకు అండగా ఎమ్మెల్సీ కవిత.. MBBS ఫీజు మొత్తం చెల్లిస్తానని హామీ

-

చదువుకోవాలనే పట్టుదల ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా ఈజీగా అధిగమించొచ్చని నిరూపించింది నిజామాబాద్ జిల్లా నాందేవ్‌గూడకు చెందిన హారిక. యూట్యూబ్‌లో క్లాసులు విని ఎంబీబీఎస్​కి అర్హత సాధించింది. ఎంబీబీఎస్ లో సీటు వచ్చినా.. ఆ విద్యను అభ్యసించేందుకు ఫీజు కట్టే స్థోమత లేదు హారిక కుటుంబానికి. ఎవరైనా సాయం చేస్తారేమోనని దాతల కోసం ఎదురుచూస్తోంది. మీడియా ద్వారా ఈ విషయం కాస్త ఎమ్మెల్సీ కవిత చెవిలో పడింది. ఇంకేం.. ఈ చదువుల తల్లికి సాయం చేయడానికి కవిత ముందుకొచ్చారు.

నిజామాబాద్ పర్యటనలో ఉన్న కవిత హారికను కలిసి ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసేందుకయ్యే ఖర్చును భరిస్తానని భరోసా కల్పించారు. తొలి ఏడాదికి చెందిన కాలేజీ ఫీజును చెక్కురూపంలో అందించారు. చదువుకోవాలన్న ఆకాంక్ష, తపన ఉంటే ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదని కవిత అన్నారు. విద్యార్థులంతా ఆ యువతిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

ఎంబీబీఎస్‌ చదువులో రాణించి వైద్యురాలిగా సమాజ సేవలు అందించాలని కవిత ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ కవిత వైద్య విద్య చదువుకు అండగా నిలిచినందుకు హారికతోపాటు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. చెక్కు అందుకుంటున్న సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news