రాజమండ్రి: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బెదిరింపులు ఆడియో కాల్ కలకలం రేగింది. ఇటీవల కాలంలో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్వగ్రామం రామచంద్రాపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలపై వైసీపీకి చెందిన స్థానిక వ్యక్తి వీర్రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీర్రెడ్డికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. తమ ఫ్లెక్సీపై ఫిర్యాదు చేయాల్సిన అవసరమేందంటూ సీరియస్ అయ్యారు. ఇలాంటి పనులు చేస్తే కాళ్లూ, చేతులు తీయించేస్తానంటూ బెదిరించారు. దీంతో వీర్రెడ్డి జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. తోట త్రిమూర్తుల వల్ల తనకు ప్రాణ హాని ఉందంటూ, తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని వీర్రెడ్డి కోరారు.
దీంతో స్థానిక పోలీసులకు జిల్లా ఎస్పీ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే తోట త్రిమూర్తులు బెదిరింపులకు పాల్పడిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో స్థానిక వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన తోట త్రిమూర్తులు తమపై ఆధిపత్యం చెలాయించడమేంటని అంటున్నారు. తోట త్రిమూర్తులు తీరుపై సీఎం జగన్ స్పందించాలని అంటున్నారు. ఇలాంటి పరిణామాలు జరిగితే జిల్లాలో పార్టీకి చాలా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.