బెెంగళూరులో ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన మొదలైంది. యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో 14వ ‘ఏరో ఇండియా 2023 ’ షోను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం పలు విమానాల విన్యాసాలను ఆయన తిలకించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన ఎన్నో అవకాశాలకు రన్‌వేగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఎయిర్‌షోలో భాగంగా భారత్, విదేశీ రక్షణ కంపెనీల మధ్య రూ.75వేల కోట్ల విలువైన 251 ఒప్పందాలు జరగనున్నట్లు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
‘ద రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్’ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన నేటి నుంచి ఐదు రోజుల పాటు జరగనుంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 98 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు తమ విన్యాసాలను ప్రదర్శించనున్నారు. భారతీయ, విదేశీ రక్షణ రంగ సంస్థలు ఈ ప్రదర్శనలో.. భారీ ప్రదర్శనకారుల విభాగంలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు.