ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలతో సంచలనంగా మారారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు.. కుదుర్చుకున్న డీల్స్ కు సంబంధించి ఆయన తీసుకుంటున్న చర్యలపై ఇప్పటికే పలు సంస్థలు అభ్యంతరం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఊహించని రీతిలో ట్వీట్ చేసి షాకిచ్చారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరును తప్పు పట్టటమే కాదు.. భారీ విమర్శ చేసిన వైనం షాకింగ్ గా మారింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త కమ్ అక్షయపాత్ర సహ వ్యవస్థాపకుడు మోహన్ దాస్ పాయ్ తాజాగా చేసిన ట్వీట్ పై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ఏపీ ఫ్యూచర్ ను జగన్ నాశనం చేస్తున్నారంటూ.. రాజధాని అమరావతి పనుల నిలిపివేత.. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పున:సమీక్ష లాంటి చర్యలతో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్ప పట్టారు. ప్రభుత్వ ఉగ్రవాదం అంటూ పెద్ద పద ప్రయోగాన్ని చేసిన ఆయన.. తన వాదనకు తగ్గ ఆధారాల్ని ట్వీట్ తో పాటు జత చేశారు. సౌర.. పవన పీపీఏలను పున:సమీక్షపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జపాన్ ప్రభుత్వం రాసిన లేఖను జత చేశారు.
పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బ తీసేలా.. ప్రభుత్వం ఒప్పందాల్ని తిరగతోడుందన్నారు. జగన్ తన ప్రభుత్వ ఉగ్రవాదంతో ఏపీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల్ని తిరగతోడుతున్నారని.. ఇలా అయితే ఎవరైనా ఇక్కడ పెట్టుబడులు పెడతారా? అని ప్రశ్నిస్తూ.. ఏకంగా జగన్ ట్విట్టర్ ఖాతాకు జత చేయటం గమనార్హం. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. ఏపీ ప్రభుత్వ వర్గాల్లో కొత్త చర్చకు తెర తీసింది.