ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ అనుసంధానం ఆప్షన్ మాత్రమే అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాయి. అయినా తెలంగాణ ఓటర్లు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ముందుకొచ్చారు. అందుకే ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రక్రియ రాష్ట్రంలో అద్భుత స్పందన లభించింది.
రాష్ట్రంలో ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ అనుసంధానం కోటి మార్కును అధిగమించింది. దీనికి అద్భుతమైన స్పందన వస్తోందని, 45 రోజుల వ్యవధిలోనే కోటికిపైగా ఓటర్లు ఆధార్ అనుసంధానం చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఐచ్ఛికంగా , స్వచ్ఛందగా ఓటరుకార్డును ఆధార్‌తో అనుసంధానించుకునే ప్రక్రియ. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది.
కోటి మార్కు అధిగమించడంలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించాయని, వారి సాయంతో 40 లక్షల మంది వరకు ఓటర్లు అనుసంధానించుకున్నట్లు వికాస్‌రాజ్ పేర్కొన్నారు. ఓటరు గుర్తింపుకార్డుతో ఆధార్ అనుసంధానం ఐచ్ఛికం మాత్రమేనని మరోమారు స్పష్టం చేసిన సీఈఓ… ఆధార్ వివరాలు గోప్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. 2023 జనవరి ఐదో తేదీన ఓటర్ల తుదిజాబితా ప్రకటించనున్నట్లు వికాస్‌రాజ్ చెప్పారు.