మద్యపాన ప్రియుల సంఖ్య మన దేశంలో ఏటా పెరుగుతూనే ఉంది. ప్రతి ఏడాదీ కొత్తగా మద్యం సేవించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అందులో భాగంగానే మద్యం అమ్మకాలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. అయితే జర్మనీకి చెందిన టీయూ డ్రెస్డెన్ అనే సంస్థ నిర్వహించిన పరిశోధన ప్రకారం మన దేశంలో గత దశాబ్ద కాలంలో మద్యం సేవించే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వెల్లడైంది.
2010 నుంచి 2017 మధ్య మన దేశంలో ఏడాదికి సగటున ఒక వ్యక్తి సేవిస్తున్న మద్యం 4.3 నుంచి 5.9 లీటర్లకు పెరిగిందని పరిశోధనలో వెల్లడైంది. ఆయా సంవత్సరాల మధ్య మద్యం సేవించే వారి సంఖ్య ఏకంగా 38 శాతం పెరిగినట్లు తేలింది. ఇక మన దేశంలో పురుషులే కాదు, స్త్రీలు కూడా మద్యం సేవించడంలో పోటీ పడుతున్నారు. మన దేశంలో అస్సాంకు చెందిన మహిళలు ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న మహిళల కన్నా ఎక్కువగా మద్యం సేవిస్తున్నారని వెల్లడైంది. ముఖ్యంగా 15 నుంచి 49 సంవత్సరాల మధ్య ఉన్న అస్సాం మహిళలే ఎక్కువగా మద్యం తాగుతున్నారని గుర్తించారు.
ఇక మన దేశంలో ఎక్కువగా మద్యం సేవిస్తున్న మహిళలు ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. గతేడాది ఆ రాష్ట్రం ఆ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఈసారి అస్సాం నిలవడం విశేషం. ఏటా మద్యం సేవిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నందునే ఆ మహిళల సంఖ్య కూడా పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.