నిన్నటివరకు అధికారపార్టీ నేతల గురి అంతా ప్రతిపక్షపార్టీ అధినేత పైనే ఉండేది.కానీ ఇప్పుడు సడన్ గా సీన్ మారుతుంది.టార్గెట్ పాలిటిక్స్ నడుస్తున్నాయ్ . ఏడాది కాలంగా ప్రతిపక్ష పార్టీని పెద్దగా పట్టించుకోని అధికారపార్టీ నేతలు ఇప్పుడు కొత్త టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారన్న చర్చ మొదలైందట . నాలుగైదు నెలల క్రితం వరకూ ఏ సందర్భంలోనైనా అధికార వైసీపీ నేతలు తమ విమర్శలన్నీ టీడీపీ అధినేత చంద్రబాబు వరకే పరిమితం చేశారు. కానీ ఇప్పుడు రూటు మార్చారు.
టీడీపీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న నేత అచ్చెన్నాయుడు . గత ఐదేళ్ల అధికారంలోనూ … ప్రస్తుత ఏడాదిన్నర ప్రతిపక్షంలోనూ అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత జగన్ ను నిత్యం టార్గెట్ చేస్తూనే వచ్చారు . దీంతో అచ్చెన్నాయుడు అధికారపార్టీకి కొరకరాని కొయ్యగా మారారట . ఇలాంటి సమయంలో ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న అవకాశం కలిసివచ్చి ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు జైలుకెళ్లడంతో వైసీపీ నేతలు ఫుల్ హ్యాపీ అయ్యారట . ఇక అప్పట్నుంచి సిక్కోలు వైసీపీ నేతలు సైతం అచ్చెన్నాయుడిని టార్గెట్ చేసి అరకొర విమర్శలు చేస్తూనే వస్తున్నారట.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీ టీడీపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా తనను నియమించిన వెంటనే అచ్చెన్నాయుడు మళ్లీ తన పాతపంథాలోకి వచ్చేశారట . అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ మాటల దాడి చేస్తున్నారట .అచ్చెన్నాయుడిని టార్గెట్ చేస్తూ నిత్యం టెక్కలి నియోకవర్గంలో ఎండగట్టే ఒకే ఒక్క అధికారపార్టీ నేత దువ్వాడ శ్రీనివాస్ . ఇక నియోకవర్గ ఇంఛార్జ్ గా వైసీపీ అధినేత బాధ్యతలు అప్పగించడంతో గతంలో కంటే దువ్వాడ స్పీడు పెంచారట . ఐతే టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ మినహా మొన్నటి వరకూ అచ్చెన్న పై సాఫ్ట్ గా ఉన్న సిక్కోలు అధికారపార్టీ నేతలందరూ ఇప్పుడు అతని బాటలోనే నడుస్తున్నారట .
అచ్చన్న అధ్యక్షుడు అవ్వగానే బిసి కార్పొరేషన్ల నామినేషన్ పదవులు ,వరదల పై సీఎం జగన్ ను అచ్చెన్నాయుడు టార్గెట్ చేయడంతో సిక్కోలు వైసీపీ నేతలకు కాలుతోందట . దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం మొదలుకుని , డిఫ్యూటీ సీఎం కృష్ణదాస్ ,మరో మంత్రి అప్పలరాజు వరకూ అందరూ అచ్చెన్న పైనే కాన్సట్రేషన్ పెట్టారట . ఏచిన్న సందర్భం దొరికినా విమర్శలతో వాయించేస్తున్నారట . చంద్రబాబు ప్రస్తుతం ఎలాగూ సైలెంట్ అయ్యారు…ఇలాంటి సమయంలో అచ్చెన్నాయుడిని కట్టడి చేయకపోతే కష్టమని భావించిన అధికారపార్టీ నేతలు … అదేదో సిక్కోలు నుంచే చేస్తే పోలా అనే ధోరణిలో ఉన్నారట . అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా అచ్చెన్న పై మాటలదాడి చేస్తున్నారట .