కాంగ్రెస్లో ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(2018) అనంతరం అధిష్ఠానం తనకు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇచ్చిందని వెల్లడించారు భాజపా ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా. ప్రజల కోసం పని చేయాలనే ఉద్దేశంతోనే ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్లో బిజేపి చేపట్టిన మూడు రోజుల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సోమవారం పాల్గొన్నారు సింధియా. తొలిసారి ఈ విషయాన్ని వెల్లడించారు.
బిజేపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన కాంగ్రెస్ నాయకులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు సింధియా. అధికారం కోల్పోయిన ఐదు నెలల తర్వాత ఎట్టకేలకు ప్రజల మధ్యకు వచ్చారని ఎద్దేవా చేశారు. జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడిన తర్వాత గ్వాలియర్-ఛంబల్ ప్రాంతంలో కాంగ్రెస్ పని అయిపోయిందని అంతా భావించారని.. కానీ పార్టీని పునరుద్ధరించామని సీనియర్ నేత దిగ్విజయ సింగ్ చెప్పారు. రాహుల్, ప్రియాంకకు సన్నిహితుడైన సింధియా కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతారని తాను ఊహించలేదన్నారు. పార్టీ ఆయనకు అన్నీ ఇచ్చిందని పేర్కొన్నారు.