ఎంఎస్ ధోనీకి ట్విట్ట‌ర్ షాక్‌.. అకౌంట్ కు ఉన్న బ్లూ టిక్ తొల‌గింపు.. వెంట‌నే పున‌రుద్ధ‌ర‌ణ‌..

-

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీకి ట్విట్ట‌ర్ షాకిచ్చింది. ధోనీ ట్విట్ట‌ర్ అకౌంట్‌కు ఉన్న అఫిషియ‌ల్ బ్లూటిక్ మార్క్‌ను తొల‌గించారు. ధోనీ ట్విట్ట‌ర్‌ను స‌రిగ్గా వాడ‌డం లేద‌ని అందుక‌నే ట్విట్ట‌ర్ ఆ టిక్‌మార్క్‌ను తొలగించింద‌ని తెలుస్తోంది. ధోనీ 2018 నుంచి నిజానికి ట్విట్ట‌ర్‌లో పెద్ద‌గా పోస్టులు పెట్ట‌డం లేదు. అత‌ను చివ‌రిసారిగా జ‌న‌వ‌రి 8, 2021న ట్వీట్ చేశాడు.

ms dhoni twitter account blue tick removed

2019లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడాక ధోనీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. త‌రువాత పెద్ద‌గా మ్యాచ్‌లు ఆడ‌లేదు. కొన్నాళ్ల పాటు ఆర్మీలో సేవ చేశాడు. ఐపీఎల్ 2020లో ఆడాడు. గతేడాది ఆగ‌స్టు 15న అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఆ విష‌యాన్ని ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్ల‌డించాడు. ఆగ‌స్టు 20న మోదీకి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు. త‌రువాత సెప్టెంబ‌ర్ నెల‌లో ఇండియ‌ర్ ఎయిర్ ఫోర్స్ గురించి 2 ట్వీట్లు చేశాడు.

2019లో ధోనీ మొత్తం 7 ట్వీట్లు చేయ‌గా, 2018లో యాక్టివ్‌గానే ఉన్నాడు. ఆ ఏడాది అత‌ను 20 ట్వీట్లు చేశాడు. అయితే ధోనీ ట్విట్ట‌ర్‌లో స‌రిగ్గా యాక్టివ్‌గా ఉండ‌క‌పోవ‌డం వ‌ల్లే అత‌ని అకౌంట్‌కు ఉన్న బ్లూ టిక్‌ను తొలగించిన‌ట్లు తెలుస్తోంది.

ఇక ధోనీ 2004లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌తో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ప్ర‌వేశించాడు. 2014లో టెస్టుల నుంచి రిటైర్ అవ‌గా, త‌రువాత టీ20, వన్డేల‌కు కూడా గుడ్ బై చెప్పాడు. ధోనీ మొత్తం 90 టెస్టులు ఆడాడు. 350 వ‌న్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 10,773 ప‌రుగుల‌ను వ‌న్డేల‌లో పూర్తి చేయ‌గా, వ‌న్డేల్లో అత‌ను 183 ప‌రుగుల అత్యుత్తమ స్కోరు సాధించాడు. ఇక మూడు మేజ‌ర్ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా కూడా ధోనీ రికార్డు సృష్టించాడు. అత‌ని సార‌థ్యంలో భార‌త్ టీ20, వ‌న్డే వ‌ర‌ల్డ్‌ క‌ప్‌ల‌ను, చాంపియ‌న్స్ ట్రోఫీని గెలుచుకుంది.

అప్‌డేట్‌: మ‌హేంద్ర సింగ్ ధోనీకి చెందిన ట్విట్ట‌ర్ అకౌంట్ కు బ్లూ టిక్‌ను తొల‌గించిన ట్విట్ట‌ర్ త‌ప్పును స‌రిదిద్దుకుంది. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో ట్విట్ట‌ర్ మ‌ళ్లీ బ్లూ టిక్‌ను కొనసాగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం ధోనీ ట్విట్ట‌ర్ అకౌంట్ కు బ్లూ టిక్ ద‌ర్శ‌న‌మిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news