కరోనా వల్ల అనేక మంది తీవ్రంగా నష్టపోయారు. కానీ 2020 మాత్రం ముకేష్ అంబానీకి లాభాల పంట పండించింది. ప్రత్యేకించి లాక్‌డౌన్ సమయంలో ఆయనకు చెందిన రిలయన్స్ జియో కంపెనీలో ఫేస్‌బుక్, విస్టా ఈక్విటీ, ముబాదల తదితర ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. తాజాగా సౌదీ అరేబియాకు చెందిన పీఐఎఫ్ జియోలో పెట్టుబడి పెట్టడంతో జియో ఇప్పుడు అప్పులు లేని కంపెనీగా ఆవిర్భవించింది. ఈ క్రమంలో కేవలం రెండు నెలల్లోనే జియోలో మొత్తం రూ.1,68,818 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది నిజంగా విశేషమనే చెప్పవచ్చు.
కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో జియో అప్పటికే తమ కంపెనీలో ఉన్న పెట్టుబడిదారులకు షేర్లను అమ్మడం ద్వారా రూ.53,124.20 కోట్లను సమీకరించింది. అలాగే జియో ప్లాట్‌ఫాంలలో వాటాలను విక్రయించడం ద్వారా మరో రూ1,15,693.95 కోట్లను సమకూర్చుకోగలిగింది. కాగా ముకేష్ అంబానీ తాము సాధించిన ఈ ఘనతపై స్పందిస్తూ.. మార్చి 31, 2021 వరకు తమ కంపెనీ షేర్ హోల్డర్లను రుణ విముక్తులుగా చేస్తానన్న మాట నిలుపుకున్నానని తెలిపారు. జియో, రిలయన్స్ రిటెయిల్‌లలో పెట్టుబడులను పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపించారని అన్నారు. రానున్న రోజుల్లో తమ వ్యాపార భాగస్వాములను ఆయా వ్యాపారాల్లో చురుగ్గా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. అలాగే రానున్న 5 ఏళ్ల కాలంలో తమ కంపెనీలు లిస్టింగ్‌కు వెళ్తాయని తెలిపారు.
కాగా జియో ప్లాట్‌ఫాంలలలో మొత్తం 10 మంది అంతర్జాతీయ పెట్టుబడిదారులు 24.70 శాతం వాటాలను కొనుగోలు చేశారు. ఫేస్‌బుక్ తొలుత రూ.43,573 కోట్లతో 9.99 శాతం వాటాను కొనుగోలు చేయగా, అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ రూ.5,655.75 కోట్లతో మే 4వ తేదీన 1.15 శాతం వాటా కొన్నారు. అలాగే వీరు జూన్ 5వ తేదీన మరో రూ.4,546 కోట్లతో మరో 0.93 శాతం వాటాను కొన్నారు. ఇక మే 8న విస్టా ఈక్విటీ రూ.11,367 కోట్లతో జియోలో 2.32 శాతం వాటాను కొనుగోలు చేసింది. అమెరికాకు చెందిన జనరల్ అట్లాంటిక్ రూ.6,598.38 కోట్లతో 1.34 శాతం వాటాను మే 17వ తేదీన కొనుగోలు చేసింది.
కోహ్ల్‌బర్గ్ క్రేవిస్ రాబర్ట్స్ అండ్ కో (కేకేఆర్) మే 22న రూ.11,367 కోట్లతో 2.32 శాతం వాటాను జియోలో కొనగా, దుబాయ్‌కు చెందిన ముబాదల రూ.9,093.60 కోట్లతో 1.85 శాతం వాటాను జూన్ 5న కొనుగోలు చేసింది. జియోలో పెట్టుబడి పెట్టిన 6వ కంపెనీగా ఈ కంపెనీ గుర్తింపు పొందింది. దుబాయ్‌కు చెందిన అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ రూ.5,683.50 కోట్లతో జూన్ 7న జియోలో 1.16 శాతం వాటాను కొన్నది. అలాగే టీపీజీ (టెక్సాస్ పసిఫిక్ గ్రూప్), ఎల్ క్యాటర్‌టన్ కంపెనీలు జూన్ 13న జియోలో రూ.4,546.80 కోట్లు, రూ.1,894.50 కోట్లతో 0.93, 0.39 శాతం వాటాను కొన్నాయి. తాజాగా సౌదీ అరేబియాకు చెందిన పీఐఎఫ్ కంపెనీ రూ.11,367 కోట్లతో 2.32 శాతం వాటాను జియోలో కొనుగోలు చేయడంతో.. జియో రుణాలు లేని కంపెనీగా ఆవిర్భవించింది.