జియో 5జీ సేవలపై ముకేశ్​ అంబానీ కీలక ప్రకటన

-

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వార్షిక సాధారణ సమావేశం (AGM‌) జరిగింది. వర్చువల్‌గా ఈ సమావేశం నిర్వహించారు. 5జీ టెలికాం సేవలు, 5జీ ఫోన్‌, రిలయన్స్‌ ఆర్థిక అంశాలు సంబంధించిన విషయాలపై ముకేశ్​ మాట్లాడారు.

దీపావళికల్లా జియో 5జీ సేవలు.. జియో 5జీ సేవలకు సంబంధించి ముకేశ్‌ అంబానీ కీలక ప్రకటన చేశారు. దీపావళికల్లా కీలక నగరాల్లో 5జీ సేవలు తీసుకొస్తామని చెప్పారు. తొలుత దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ఈ సేవలను దీపావళికల్లా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రతి నెలా ఈ సేవలను విస్తరించుకుంటూ వెళతామని చెప్పారు. 2023 డిసెంబర్‌ కల్లా అంటే రాబోయే 18 నెలల్లో దేశంలోని ప్రతి పట్టణం, ప్రతి మండలంలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఇందుకోసం మొత్తం రూ.2లక్షల కోట్లు వెచ్చించనున్నామని ముకేశ్‌ తెలిపారు.

ముఖేశ్ అంబానీ
ముఖేశ్ అంబానీ

రిలయన్స్‌ ఆర్థిక అంశాలు ముకేశ్‌ ఏమన్నారంటే…

గత ఏడాది కాలంలో రిలయన్స్‌ అన్ని రంగాల్లో రాణించింది. ఏకీకృత ఆదాయం 47 శాతం పెరిగి రూ.7.93 లక్షల కోట్లకు చేరింది. వార్షిక ఏకీకృత EBITDA రూ.1.25 లక్షల కోట్లు దాటింది. రిలయన్స్‌ ఎగుమతులు 75 శాతం ఎగబాకి రూ.2.50 లక్షల కోట్లకు చేరాయి. భారత మర్చండైజ్‌ ఎగుమతుల్లో రిలయన్స్‌ వాటా 8.4 శాతం.

5జీ సేవలు
5జీ సేవలు

భారత్‌లో రిలయన్స్‌ అతిపెద్ద పన్ను చెల్లింపు సంస్థగా నిలిచింది. ప్రత్యక్ష, పరోక్ష మార్గాల్లో రిలయన్స్‌ చెల్లించిన పన్నుల విలువ 38.8 శాతం పెరిగి రూ.1.88 లక్షల కోట్లకు చేరింది. రిలయన్స్‌ కొత్తగా 2.32 లక్షల మంది ఉద్యోగుల్ని నియమించుకుంది. రిలయన్స్‌ రిటైల్‌ భారత్‌లోనే అత్యధిక ఉద్యోగాలు కల్పించిన సంస్థగా నిలిచింది.

మేమే నంబర్‌.1.. గత ఏడాది కాలంలో జియో భారత్‌లో అతిపెద్ద డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. జియో 4జీ నెట్‌వర్క్‌లో 421 మిలియన్ల మంది బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీరంతా ప్రతినెలా సగటున 20 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. ఫిక్స్‌డ్‌లైన్‌ నెట్‌వర్క్‌లోనూ జియో దూసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా జియో ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌ పొడవు 11 లక్షల కి.మీకు చేరింది. ఇది భూమి చుట్టూ 27 సార్లు చుట్టిరావడంతో సమానం. ప్రతి ముగ్గురు కొత్త బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లలో ఇద్దరు జియోను ఎంచుకుంటున్నారు. ఈ రంగంలో నంబర్‌ 1 ఉన్నాం. 7 మిలియన్‌ మంది కస్టమర్లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news