కరోనా మహమ్మారి అనేక రకాల స్ట్రెయిన్లలో మళ్లీ మళ్లీ వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ఒకసారి సోకిన వారికి రెండో సారి కూడా వస్తోంది. అయితే ముంబైకి చెందిన ఓ డాక్టర్‌కు ఏకంగా మూడో సారి కోవిడ్ సోకింది. దీంతో ఈ విషయంపై నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఆ డాక్టర్‌కు ఒకే నెలలో రెండు సార్లు ఇన్‌ఫెక్షన్ సోకడం ఆందోళన కలిగిస్తోంది.
ముంబైకి చెందిన 26 ఏళ్ల డాక్టర్ సృష్టి హలరి స్థానిక ములుంద్ కోవిడ్ సెంటర్‌లో సేవలు అందిస్తున్నారు. అయితే ఆమె గతేడాది జూన్ 17వ తేదీన కోవిడ్ బారిన పడ్డారు. ఎలాంటి లక్షణాలు లేకపోయినా ఆమెకు ఆర్‌టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్ అని వచ్చింది. అయితే ఆమె అప్పుడు ఇంట్లో ఉండి చికిత్స తీసుకున్నారు.
ఇక ప్రస్తుతం ఆమె డాక్టర్‌గా సేవలు అందించడం లేదు. ఇంట్లోనే పీజీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. కానీ ఆమెకు గత మే 29, జూలై 11 తేదీల్లో కోవిడ్ సోకింది. రెండు సార్లు ఆమెకు ఫ్లూ లాంటి లక్షణాలు కనిపించాయి. అయితే మొదటి సారి, రెండో సారి కోవిడ్ సోకినప్పుడు ఆమె ఇంట్లోని వారికి కరోనా వ్యాపించలేదు. కానీ మూడో సారి ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని తేలాక ఇంట్లో ఉన్న అందరికీ కోవిడ్ వచ్చింది. దీంతో ఈ కోవిడ్ స్ట్రెయిన్ మొదటి రెండు స్ట్రెయిన్ల కన్నా ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుందేమోనని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక డాక్టర్ సృష్టి ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటుండగా.. ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యులందరి శాంపిల్స్ ను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపించారు. ఆమెకు, వారికి సోకి కోవిడ్ స్ట్రెయిన్ గురించి సైంటిస్టులు తెలుసుకోనున్నారు. దీంతో ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.