పిలవని పుట్టిన రోజు వేడుకకు వచ్చిన కొందరు అపరిచితులు ఓ వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్ చంపా జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతుడిని కమలేశ్వర్ దేవాంగన్గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. హత్య నేరం కింద వీరిపై కేసు నమోదు చేశారు.
ఆగస్టు 31 అర్ధరాత్రి శ్రీకృష్ణ తులసీ ధర్మశాల వద్ద బిన్ని దేవాంగన్ అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నాడు. పార్టీ జరుగుతుండగా కిరణ్ సారథి, మనీశ్ సారథి అనే ఇద్దరు లోనికి వచ్చారు. పార్టీలో ఉన్నవారెవరికీ వీరి గురించి తెలియదు. ఆహ్వానం లేకున్నా వీరు లోపలికి వచ్చి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. కమ్లేశ్వర్ సహా మరికొందరు వారిని అడ్డుకొని ప్రశ్నించారు. వీరి మధ్య ఘర్షణ తలెత్తింది.
పార్టీలోకి చొరబడ్డ ఇద్దరు వ్యక్తులు వెంటనే తమ ఆరుగురు స్నేహితులను ఘటనాస్థలికి పిలిపించుకున్నారు. ఎనిమిది మంది కలిసి కమ్లేశ్వర్, అతడి స్నేహితులను కొట్టారు. కమ్లేశ్వర్ ఇంటి మేడపైకి పారిపోగా.. నిందితులు అతడిని పట్టుకొని పైనుంచి తోసేశారు. బాధితుడు కమ్లేశ్ను వెంటనే బిలాస్‌పుర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు అతడు ప్రాణాలు కోల్పోయారు.