తెలంగాణాలో తెరాస నేతను దారుణంగా హత్య చేసారు. సూర్యాపేట జిల్లాలో ఈ ఘటన జరిగింది. సహకార సంఘం ఎన్నికల ప్రచారంలో చెలరేగిన ఘర్షణ కారణంగా ఈ హత్య జరిగింది. వివరాల్లోకి వెళితే ఎల్కాపురం మాజీ సర్పంచ్ వెంకన్న ను దారుణంగా హత్య చేసారు ప్రత్యర్ధులు. ఆయన తెరాస పార్టీలో గ్రామంలో కీలక నేతగా ఉన్నారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ తెరాస నేతల మధ్య గ్రామంలో ఘర్షణ వాతావరణం ఉంది.
సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడ వర్గాల మధ్య కూడా తీవ్ర స్థాయిలో ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే సహకార సంఘ ఎన్నికలు మరింత ఆజ్యం పోశాయి. ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. దీనితో ఆయన్ను ప్రత్యర్ధులు రాళ్ళతో కొట్టి చంపారు. దీనితో ఒక్కసారిగా గ్రామంలో వాతావరణం వేడెక్కింది.
భారీగా పోలీసులు మొహరించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ ఎలాంటి ఘర్షణలు జరగకుండా జాగ్రత్తలు పడుతున్నారు. సహకార సంఘం ఎన్నికలే దీనికి కారణమని అంటున్నా, వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని సమాచారం. గత రెండు రోజులుగా ఇరు వర్గాల మధ్య వాతావరణం మరింత వేడెక్కింది అని, రాజకీయ కక్షలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని అంటున్నారు.