చైనాలో తయారయ్యే వస్తువులతోపాటు.. చైనా దేశ కంపెనీలకు చెందిన ఏ వస్తువునూ భారత్‌లో వాడకూడదని.. చైనా వస్తువులను బ్యాన్ చేసి కేవలం స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలని.. దేశంలో ప్రస్తుతం జోరుగా ఉద్యమం నడుస్తోంది. ప్రధాని మోదీయే స్వయంగా ఇటీవల ఆ విధంగా పిలుపునిచ్చారు. దీంతో జనాలందరూ స్వదేశీ వస్తువులను వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఓ వైపు చైనా వస్తువులను బ్యాన్ చేయాలని చెబుతూనే.. మరోవైపు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే చైనాకు చెందిన యాప్‌ను వాడుతుండడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
టిక్‌టాక్.. ఆ యాప్ గురించి తెలియని వారుండరు. ఇది నిజానికి చైనాకు చెందిన యాప్. దీన్ని మన దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ యాప్‌ను బ్యాన్ చేయాలని కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అయితే స్వదేశీ వస్తువులను వాడాలనే ఉద్యమం ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు టిక్‌టాక్‌ను విరివిగా ఉపయోగిస్తోంది. అందులో కేంద్ర ప్రభుత్వం అకౌంట్‌ను ఓపెన్ చేయడమే కాదు.. కరోనా వైరస్, యోగా, కేంద్ర ప్రభుత్వ పథకాలు తదితర అనేక అంశాలకు చెందిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై ప్రస్తుతం పలువురు మండి పడుతున్నారు.
చైనాకు చెందిన వస్తువులను బ్యాన్ చేయాలని చెబుతూనే.. మరో వైపు కేంద్రం ఇలా చైనా యాప్‌ను వాడడం వెనుక ఉన్న ఉద్దేశ్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. మరి కేంద్రం దీనిపై ఏమని సమాధానం చెబుతుందో చూడాలి.