ప్రకృతికి ఆధ్యాత్మికతకు ముడిపడిన మన పండుగలలో నాగుల చవితికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం నాగదేవతను పూజించడం మాత్రమే కాదు భూమిని, వ్యవసాయాన్ని రక్షించే సర్పజాతి పట్ల కృతజ్ఞతను తెలియజేసే ఒక గొప్ప సంస్కృతి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దీపావళి తర్వాత వచ్చే ఈ పండుగను 2025లో ఎప్పుడు జరుపుకోవాలి? పూజకు శుభ ముహూర్తం, చేయాల్సిన పనులేమిటో తెలుసుకుందాం..
ఈ సంవత్సరం ఎప్పుడు: నాగుల చవితి 2025 అక్టోబర్ 25 శనివారం నాడు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను కార్తీక శుద్ధ చతుర్థి రోజున ఘనంగా జరుపుకుంటారు. నాగదేవతలను పూజించడం వలన సంతానం, కుటుంబ క్షేమం కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నాగదోషాలు, రాహు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.
పూజా సమయం: 2025లో నాగదేవత పూజకు ఉత్తమ సమయం అక్టోబర్ 25, శనివారం ఉదయం 08:59 గంటల నుండి 10:25 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో పూజ చేయడం అత్యంత శుభప్రదం.

నాగుల చవితి రోజు భక్తులు పుట్ట దగ్గరకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. పుట్టలో పాలు, గుడ్లు, నైవేద్యం (చెలిమిడి, వడపప్పు వంటివి) సమర్పిస్తారు. పసుపు, కుంకుమ, పూలతో నాగదేవతను అలంకరించి దీపారాధన చేస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండటం, నాగస్తుతి లేదా నాగదేవత మంత్రాలను పఠించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పూజ వల్ల ప్రకృతి పట్ల మనకున్న గౌరవం వ్యక్తమవుతుంది.
నాగుల చవితి అనేది భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇచ్చే పండుగ. ఈ శుభ దినాన భక్తి శ్రద్ధలతో నాగదేవతను పూజించి ఆ దేవతల ఆశీస్సులు, సుఖ సంతోషాలను, ఆయురారోగ్యాలను పొందాలని కోరుకుందాం.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం పూజా సమయాలు సాధారణ పంచాంగం ప్రకారం ఇవ్వబడ్డాయి. మీ ప్రాంతం మరియు స్థానిక పండితుల సూచనల మేరకు పూజా సమయాలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.