రెండు చెక్క‌ల‌వుతోన్న న‌ల్ల‌మ‌ల‌… డేంజ‌ర్లో అరుదైన జంతుజాలం…!

-

నల్లమల అడవుల్లోని నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ రెండు ముక్కలుగా విడిపోనుందా ? ఈ టైగ‌ర్ రిజ‌ర్వ్ నుంచి నేష‌న‌ల్ హైవేను డైవ‌ర్ట్ చేస్తూ నిర్మించే రోడ్డు వ‌ల్ల ఈ అభ‌యార‌ణ్యంలో ఉన్న అరుదైన జంతుజాతి జీవనానికి ముప్పు వాటిల్ల‌నుందా ? అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) ప్రతిపాదించిన ప్రాజెక్టు ఓకే అయితే ఖ‌చ్చితంగా పైన చెప్పుకున్న‌ట్టే జ‌ర‌గ‌నుంది. దీంతో ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు తీవ్రంగా క‌ల‌త చెందుతున్నారు.

ఎన్‌హెచ్ – 40 విస్త‌ర‌ణ‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో కర్నూల్ నుంచి నందికొట్కూర్, ఆత్మకూర్ మీదుగా ప్ర‌కాశం జిల్లాలోని దోర్నాల జంక్షన్ 5 వరకూ నేషనల్ హైవేను నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ర‌హ‌దారి స‌రిగ్గా నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఏరియాలో నిర్మించాల్సి ఉంటుంది. ఇదే జ‌రిగితే అక్క‌డ వ‌న్య‌ప్రాణుల జీవ‌నానికి చాలా ఇబ్బందే.

ఇవి అటూ ఇటూ తిరిగేందుకు హైవే అడ్డు అవుతుంది. వీటి మ‌నుగ‌డే క‌ష్ట‌మ‌వుతుంది. అడ‌వులు ధ్వంసం అయ్యి … జంతువుల‌కు నీటి వనరులు కూడా కరువై చనిపోయే ప్రమాదం ఏర్పడ‌నుంది. ఈ జాతీయ ర‌హ‌దారి కోసం కర్నూల్, ప్రకాశం జిల్లాల పరిధిలో ఆత్మకూర్, మార్కాపురం డివిజన్లలో భూమి సేక‌రించ‌నున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం 221 కోట్ల రూపాయలు.

ఇక్క‌డ హైవే విస్త‌రిస్తే ట్రాఫిక్ విప‌రీతంగా పెర‌గ‌డంతో పాటు రోడ్ల‌కు ఇరువైపులా ఆక్ర‌మ‌ణ‌లు పెరుగుతాయి. దీంతో వన్యప్రాణులకు ముప్పు తీవ్రంగా పెరుగుతుంది. ఇక తెలంగాణ పరిధిలోకి వచ్చే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోనూ ఈ నేషనల్ హైవేను విస్తరించాలన్న ప్రతిపాదన ఉంది. ఇక్కడ హైవే విస్తరణతో కనీసం 20 వేల చెట్లను నరికివేయాల్సి వస్తుందని చెబుతున్నారు.

ఇక ఈ టైగ‌ర్ రిజ‌ర్వ్ దేశంలోనే అతి పెద్ద‌దిగా ఉంది. ఏపీలోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో 3,568 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. బెంగాల్ టైగర్, ఇండియన్ చిరుత, ఎలుగుబంట్లు, జింకలు, మొసళ్లు, ఇండియన్ పైథాన్, తాబేళ్ల వంటి ఎన్నో జంతువులు ఇక్కడ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version