నారా భువనేశ్వరి, బ్రాహ్మణి చర్చిలో ప్రార్థనలు చేశారు. రాజమండ్రి లూధరన్ చర్చిలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి బుధవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని, దేవుడి దీవెనలు, ఆశీస్సులతో ఆయన త్వరలోనే బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఏం తప్పు చేశారని 19 రోజులుగా జైలులో నిర్బంధించారని ప్రశ్నించారు. ఎలాంటి విచారణ లేకుండానే నిర్బంధిస్తారా? ఆరోపణల్లో వాస్తవాలేంటో తెలుసుకోరా? అని నిలదీశారు. ఇప్పటివరకు ఆయన ఏం తప్పు చేశారో చెప్పలేకపోయారని.. ఏ ఆధారాలూ చూపించలేకపోయారని భువనేశ్వరి అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో శిక్షణ పొందిన యువత రూ.లక్షలు సంపాదిస్తున్నారని.. చేయి చేయి కలిపి చంద్రబాబుకు అండగా నిలుద్దామని భువనేశ్వరి టీడీపీ కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలను దోచుకుని దాచుకునే అలవాటు చంద్రబాబు నాయుడికి లేదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.