గుంటూరు జిల్లా వైసీపీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి.మొన్నటి వరకు నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు-చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని మధ్య కొనసాగిన ఆధిపత్యపోరు ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. తాజాగా ఈ జాబితాలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేరారు. వినుకొండ వైసీపీలోను రెండు వర్గాలుండటం మాజీ ఎమ్మెల్యే వర్గానికి ఎంపీ ప్రాధాన్యం ఇవ్వడం ఇక్కడా రచ్చకు కారణమైనట్లు తెలుస్తుంది.
వైసీపీ నేత మర్రి రాజశేఖర్‌కు ఎంపీ అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో చిలకలూరిపేటలో ఎంపీ ఎమ్మెల్యే మధ్య వార్ నడిచింది. తాజాగా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులకు అస్సలు పడటం లేదు. లావు వైసీపీలో చేరిన సమయంలో తనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావును వైసీపీలోకి తీసుకొచ్చారు. లావు, బొల్లా, మక్కెన ముగ్గురూ ఒకే సామాజికర్గానికి చెందిన వారు. అయినా రాజకీయాల్లో ఎవరి దారి వారిదే.
మక్కెనను వైసీపీలోకి తీసుకురావడం తనకు ఇష్టం లేదని లావుకు బొల్లా స్పష్టం చేసినట్లు చెబుతారు. అయినా ఎంపీ తన మాట పట్టించుకోలేదన్న కారణంతో లావును దూరం పెట్టారు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. ఎన్నికలు ముగిసి ఏడాది దాటినా ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఈ వైరం తగ్గలేదు కదా.. ఇంకా పెరిగిందని అంటారు. వినుకొండకు తాను ఎమ్మెల్యే అయినా.. ఎంపీ మాత్రం మక్కెనకు ప్రాధాన్యం ఇవ్వడంపై బ్రహ్మనాయుడు మండిపడుతున్నారట. మక్కెన వర్గం కూడా ఇదే టైమ్ అనుకుందో ఏమో కానీ.. ఎమ్మెల్యే బొల్లా వద్ద పనులు కాని వారిని పిలిపించి మరీ ఎంపీ దగ్గర కూర్చోబెట్టి పనులు చేయించి పెడుతున్నారట.
ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మంచైనా.. చెడు అయినా ముఖం మీదే చెప్పేస్తుంటారు. ఇది చాలా మందికి గిట్టడం లేదట. ఇలా అసంతృప్తి చెందిన వారంతా మాజీ ఎమ్మెల్యే మక్కెనను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వారందరినీ ఎంపీ దగ్గరకు తీసుకెళ్తున్నారట మక్కెన. పెండింగ్ బిల్లుల మంజూరు.. చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు ఇలా ఏం కావాల్సి వచ్చినా.. ఎంపీ దగ్గర కూర్చోబెట్టి అధికారులకు ఫోన్‌లు చేయిస్తున్నారట. ఈ సంగతి తెలుసుకున్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు రుసరుసలాడుతున్నారట. ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని.. మక్కెనకు ఎంపీ ఎలా వత్తాసు పలుకుతారని ఎంపీపై ఒంటి కాలిపై లేస్తున్నారట.
ఇది మనసులో పెట్టుకున్నారో ఏమో వినుకొండలో జరిగే అధికార, అనధికార కార్యక్రమాలకు ఎంపీని ఆహ్వానించడం లేదట బొల్లా. ఒకవేళ ఎంపీని పిలిస్తే వెంట మాజీ ఎమ్మెల్యే మక్కెన కూడా వచ్చే పరిస్థితి ఉండటంతో ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్నారు. ప్రస్తుతానికి రెండు వర్గాలు ఈ ఆధిపత్యపోరుపై ఎక్కడా బయటపడకపోయినా..పరిస్థితి మాత్రం నివురు గప్పిన నిప్పులా ఉందట.