ఆసియా కప్ 2022 లో టీమిండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా.. 5 వికెట్ల తేడాతో పాక్ పై గెలిచింది. మొదట పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 147 పరుగుల వద్ద ఆలౌట్ కాగా.. ఇండియా ఆ లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో ఛేదించింది. అయితే.. భారత్ చేతిలో ఓటమి బాధ నుంచి కోలుకోకముందే పాకిస్తాన్ కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది.
టీమిండియా తో జరిగిన తొలి మ్యాచ్ లో గాయపడ్డ పాక్ పేసర్ నసీం షా హాంకాంగ్ తో జరగబోయే తమ తదుపరి మ్యాచ్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆదివారం భారత్ తో జరిగిన మ్యాచ్ లో నసీం అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్ లో తన నాలుగు ఓవర్ల కోటాలో 27 పరుగులు ఇచ్చి, 2 కీలక వికెట్లు పడగొట్టాడు.
కాగా భారత్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసే క్రమంలో నసీం షా పాదానికి గాయమైంది. అయినప్పటికీ ఓవైపు బాధను దిగమింగుతూ తన ఓవర్ ను నసీం షా పూర్తి చేశాడు. మ్యాచ్ అనంతరం అతడిని స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అయితే అతడి గాయం అంతా తీవ్రమైనది కానప్పటికీ వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.