ఆకాశం అందేంత ఎత్తులోనే ఉంది – దూసుకుపోండి..

-

మీరొక అటామిక్‌ రియాక్టర్‌. అపారమైన శక్తి మీలో దాగుంది. దాన్ని విద్యుత్తు తయారుచేయడానికి ఉపయోగించండి. బాంబు తయారీకి కాదు. 

 

యువత – నేడు భారతదేశపు వెలకట్టలేని ఆస్థి. తలుచుకుంటే దేశ భవిష్యత్తును సమూలంగా మార్చవేయగల మేధస్సు వారి సొంతం. సక్రమమార్గంలో ఉండే యువత, తమ కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి కూడా మార్గదర్శి అవగలరు. ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద, చేగువేరా, స్టీవ్‌ జాబ్స్‌, విశ్వనాథన్‌ ఆనంద్‌, సచిన్‌ టెండుల్కర్‌… వీరందరూ యువకులుగా ఉన్నప్పుడే అనుకున్నది సాధించి, స్ఫూర్తి రగిలించినవారే. తమతమ రంగాల్ని శాసించినవారే. అందుకే.. లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. నిరాశానిస్పృహలను దూరం చేయండి. ఏకాగ్రతతో ప్రయత్నించండి. విజయం మీదే..

మీరు లక్ష్యం దిశగా దూసుకుపోయేందుకు కొన్ని చిట్కాలు..

  • మీ వయసులో చాలా ఆకర్షణలుంటాయి. అది సహజం. కానీ వాటిని నియంత్రణలోనే ఉంచడం మీ చేతిలో పని. మొబైల్‌ఫోన్‌, సోషల్‌ మీడియా, ఇంటర్‌నెట్‌లలోని చెడు కోణాలను దరిచేరనివ్వకండి. దేన్ని ఎంత వాడాలో అంతే వాడండి. సోషల్‌ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండటం అత్యుత్తమం. దానివల్ల వీసమెత్తు ప్రయోజనం లేదు. నష్టమే తప్ప.
  • అలాగే, అమ్మాయి/అబ్బాయిల మధ్య పరస్పర ఆకర్షణ. ఇది కూడా వయసులో అత్యంత సహజం. కానీ, బంధాలెప్పుడూ దుర్వినియోగం కాకూడదు. తాత్కాలిక సంతోషం కోసం ఒకరిని బాధపెట్టడం, ఒకరి జీవితంతో ఆడుకోవడం తగదు. మీలోని ప్రతీ గుణం మీ తల్లిదండ్రుల పెంపకాన్ని గుర్తు చేస్తుందని మరువకండి. ఏది మంచో, ఏది చెడో గుర్తించే ప్రయత్నం చేయండి.
  • తల్లిదండ్రులు, పెద్దవాళ్ల మాట వినండి. వాళ్లు చెప్పేవన్నీ అనుభవాల ద్వారా వచ్చినవి. మీ వయస్సులో వాళ్లు చేసిన మంచి-చెడుల ఫలితాల ప్రభావాన్నే మీకు వివరిస్తుంటారు. అయితే తరాల అంతరం ఉంటుంది కానీ, అనుభవసారం ఎప్పుడైనా ఒకటే.

  • చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. మీ లక్ష్యసాధనకు అడ్డంకిగా మారే ఏ బయటి బంధమూ అవసరం లేదు. వాటివల్ల రేపు మీ జీవితం నాశనమయితే బాధ్యత వహించేందుకు ఎవరూ ఉండరు. సమాజంలో ఎప్పుడూ మంచీ, చెడూ రెండూ ఉంటాయి. దేన్ని ఎంచుకోవాలనేది మీ విచక్షణపై ఆధారపడివుంటుంది. అదే మీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది.
  • ముందు మీరు ఓ మంచి కొడుకు / కూతురుగా మారండి. తర్వాత మీరే ఓ మంచి పౌరులవుతారు. మంచి భర్త లేదా భార్య అవుతారు. మంచి తలిదండ్రులవుతారు. కుటుంబానికి, సమాజానికి మంచి పెద్ద అవుతారు. తద్వారా దేశానికి కూడా ఉపయోగపడతారు. ఇవన్నీ విజయాలే. మీరే అప్పుడు మార్గదర్శి.

  • ఆనందంగా ఉండండి. ఉంచండి. మనచుట్టూ ఉండే నలుగురు సంతోషంగా లేకపోతే మన సంతోషానికి అర్థం లేదు. సుఖం-సంతోషం-ఆనందం, డబ్బులో ఉండదు. హృదయంలో ఉంటుంది.డబ్పును ఇతరులు ఆనందంగా ఉండటానికి వాడగలిగితే అదో పెద్ద ఉపకరణం. ప్రయత్నించండి. మీరు చేసే ఒక చిన్న సహాయం, అవతలివాళ్లను పెద్ద ప్రమాదం నుండి కూడా కాపాడగలదేమో.? ఎవరికి తెలుసు? తర్వాత వారు చూపే ఒక కృతజ్ఞతాపూర్వక చిరునవ్వు, మీకు ఎంత తృప్తినిస్తుందో అనుభవిస్తేనే తెలుస్తుంది.
  • ఒక లక్ష్యం – అదో యుద్ధం…. ఏకాగ్రత, పట్టుదల, నిజాయితీ, కష్టం… ఇవే అయుధాలు. అంతే… గెలుపు సులువు. ఆయుధాలు అవే అయినప్పుడు ఎవరైనా విజేతే. లక్ష్యాలు ఏవైనా, ఆయుధాలు మాత్రం అవే అయిఉండాలి. మనసావాచా కర్మణా ఆ లక్ష్యమే ఆలోచనగా ఉండాలి.
  • మంచి పుస్తకాలు చదవండి. నిజానికి పుస్తకాలను మించిన మంచి స్నేహితులు లేరు. గొప్పవాళ్ల జీవితచరిత్రలు, స్ఫూర్తిదాయక రచనలు, భగవద్గీత, రామాయణం, మహాభారతం. ఈ ఆఖరి మూడు గ్రంథాలను మత గ్రంథాలుగా భావించక్కర్లేదు. అవి మానవ జీవితాన్ని వివరిస్తాయి. గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథాలు అవి. పుస్తక పఠనం మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి.

  • అమ్మానాన్నలు – వారినెప్పుడూ చిన్నచూపు చూడకండి. వారు లేనిదే మీరు లేరన్న నిజం గుర్తుంచుకోండి. ఎంతో కష్టపడి, మిమ్మల్ని ఇష్టపడి కని పెంచితే మీరు ఇంతవాళ్లయ్యారు. దానికోసం వారెన్నో త్యాగాలు చేసుంటారు. మీరు గొప్పవాళ్లయితే, వాళ్లకంటే సంతోషించేవారెవరూ ఉండరు కూడా. ఇంకా చెప్పాలంటే, మీరు గొప్పవారు కాకపోయినా పరవాలేదు, మంచివారైతే చాలు. వారికదే కొండంత ఆనందం.

చివరగా ఒక్కమాట… మీరు మీ దినచర్యలో భాగంగా మీ చుట్టూ ఉండే ప్రపంచాన్ని రోజూ మామూలుఆ చూస్తూనేఉంటారు.  ఒకరోజు, ఒకసారి అదే ప్రపంచాన్ని పరీక్షగా చూడండి. నిశితంగా గమనించండి. జీవితం మీకే అర్థమవుతుంది.

చంద్రప్రతాప్‌

 

Read more RELATED
Recommended to you

Latest news