ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బులంద్‌షహర్ జిల్లాలో సేలంపుర్ ప్రాంతంలో బదాయూ – మీరట్ రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రక్కును బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. మరో 27 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ చంద్ర ప్రకాశ్ సింగ్ తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో నలుగురిని మీరట్ మెడికల్ కాలేజీకి తరలించినట్లు వెల్లడించారు. పికప్ ట్రక్ ఘజియాబాద్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ట్రక్ సరైన రూట్లోనే వస్తున్నా.. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడంతో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. రహదారిపై బస్సును ఒక్కసారిగా తిప్పడం వల్ల బస్సు ట్రక్‌ను బలంగా ఢీకొట్టిందని పేర్కొన్నారు. అయితే ప్రమాదం జరిగిన తరువాత చాలా సేపటికి అంబులెన్స్ వచ్చిందని.. పోలీసులు కూడా ఆలస్యంగా వచ్చారని స్థానికులు ఆరోపించారు.