ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారైంది. ఆలయ ట్రస్టు ప్రముఖులకు ఆహ్వానాలు కూడా పంపడం షురూ చేసింది. మరోవైపు రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో రామమంది ప్రతిష్ఠాపనను పురస్కరించుకొని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే అయోధ్యకు వెయ్యికి పైగా రైళ్లను నడపాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్‌కతా, నాగ్‌పుర్, లఖ్‌నవూ, జమ్మూ తదితర నగరాల నుంచి ఈ రైళ్లను నడుపనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.
2024 జనవరి 22న పవిత్ర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత 23వ తేదీ నుంచి సాధారణ భక్తులకు శ్రీరాముడి దర్శనం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో దేశ విదేశాల నుంచి భక్తులు అయోధ్యకు పోటెత్తే అవకాశం ఉన్నందున రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రద్దీకి తగినట్లు దాదాపు వంద రోజులపాటు అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. జనవరి 19 నుంచే ఈ రైళ్లను నడిపే అవకాశముందని పేర్కొన్నాయి.