కేరళలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 143 మంది ఈ ఘటనలో బలయ్యారు. ఈ విషయాన్ని కేరళ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు 128 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఇప్పటి వరకు 116 మంది మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ తెలిపారు. వయనాడ్‌లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పడి, మండక్కై, చూరాల్‌మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీల ఆచూకీ ఇంకా దొరకకపోవడంతో వారి కుటుంబాలతో పాటు అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.