రాజన్న సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్‌కుమార్ సాధారణ నేతన్నగా కాకుండా తన వృత్తిలో ప్రయోగాలు చేస్తుంటారు. రకరకాల చీరలను నేస్తూ తన పనితననానికి మెరుగులు దిద్దుతూ ఉంటారు. ఇప్పటికే చాలా సార్లు వివిధ డిజైన్లలో, వినూత్న రీతిలో చీరలు నేసి ప్రముఖ ఆలయాల్లో అమ్మవార్లకు కానుకగా సమర్పించారు. తాజాగా ఆయన మరో వినూత్న చీరను డిజైన్ చేశారు.
అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేసిన నల్ల విజయ్ కుమార్.. ఆ చీరను సుప్రసిద్ధ వేములవాడ రాజేశ్వరిదేవి అమ్మవారికి కానుకగా సమర్పించారు. దీంతో పాటు రాజరాజేశ్వర స్వామికి అగ్గిపెట్టెలో ఇమిడే శాలువాను బహూకరించారు. కుటుంబసమేతంగా మంగళవారం రోజున వేములవాడ రాజన్నను ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ఈవో వినోద్‌రెడ్డిని కలిసి ఈ శాలువ, చీరలను ప్రదర్శించారు. వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. అయిదున్నర మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పు, వంద గ్రాముల బరువుగల ఈ చీరను, రెండు మీటర్ల పొడవు, 32 ఇంచుల వెడల్పు, 40 గ్రాముల బరువు గల శాలువాను మూడు రోజుల్లో తయారుచేసినట్లు విజయ్‌కుమార్ తెలిపారు.