మరణానంతరం అవయవ దానం చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఆర్గాన్ డొనేషన్ చేయడానికి ముందుకు వస్తుంటారు. అలా ఇప్పటివరకు జరిగిన అవయవదానంతో పునర్జన్మ లభించిన వారు ఎంతో మంది ఉన్నారు. సాధారణంగా అవయవ దానం చేయడం కామన్.. కానీ శరీరం మొత్తాన్ని దానం చేయడానికి ముందుకు వస్తున్నారు కర్ణాటకలోని బెళగావి జిల్లా షేగుణసి గ్రామస్థులు.
మరణానంతరం శరీరాలను దానం చేయడం చాలా తక్కువగా జరుగుతుంటుంది. కానీ షెగుణసి గ్రామస్థులు మాత్రం వైద్య విద్యార్థుల కోసం ఏకంగా 185 మంది ముందుకు వచ్చారు. దహన సంస్కారాలు చేయకుండా వైద్య విద్యార్థుల కోసం శరీరాన్ని దానం చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే 108 మంది దానం చేయగా తాజాగా మరో 185మంది ముందుకు వచ్చారు. వారిలో 17మృతదేహాలను వైద్య కళాశాలకు అందించారు. మృతదేహాన్ని దానం చేసేముందు పూజలు నిర్వహిస్తామని గ్రామస్థులు అంటున్నారు. కులమతాలకు అతీతంగా ఎవరు చనిపోయినా పూజలు నిర్వహించి మృతదేహాలను వైద్య కళాశాలకు అప్పగిస్తామని గ్రామస్థులు చెబుతున్నారు.