కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ప్రస్తుతం భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్న రాహుల్.. కేసు విచారణ నిమిత్తం మంగళవారం కోర్టు ఎదుట హాజరయ్యారు. దీంతో సుల్తాన్‌పుర్ జిల్లా కోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2018 మే 8న బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్.. హోంమంత్రి అమిత్ షాపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా ఆరోపించారు. దీంతో అదే ఏడాది ఆగస్టు 4న రాహుల్‌పై పరువు నష్టం కేసు వేశారు. బీజేపీ నిజాయితీ, స్వచ్ఛమైన రాజకీయాలకు కట్టుబడి ఉందని చెబుతూనే మరోవైపు ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఆ పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకుందని రాహుల్ గాంధీ అన్నారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పట్లో ఈ అంశం రాజకీయంగా దుమారం రేపింది.