ఒక్క ఏడాదిలోనే 66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం

-

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లిన చాలా మంది అక్కడే సెటిల్ అవ్వాలని భావిస్తారు. అమెరికా పౌరసత్వం కోసం శ్రమిస్తారు. అలా అమెరికా పొందుతున్న వారిలో భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. 2022లో మెక్సికో తర్వాత అత్యధిక మంది అక్కడి పౌరసత్వం పొందింది భారతీయులే. ఆ ఏడాదిలో 65,960 మందికి సహజీకృత సిటిజన్‌షిప్‌ (Naturalization citizenship) లభించింది.

అమెరికాలో 2022 నాటికి 4.6 కోట్ల మంది విదేశీయులు నివసిస్తుండగా.. వీరిలో 2.45 కోట్ల మంది తమని తాము సహజీకృత పౌరులుగా పేర్కొన్నారు. మొత్తంగా ఆ ఏడాదిలో 9,69,380 మంది ఈ పద్ధతిలో అమెరికా పౌరులుగా మారారు. ఈ విషయాన్ని స్వతంత్ర ‘కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌’ నివేదిక వెల్లడించింది.

2022లో 1,28,878 మంది మెక్సికన్లు అమెరికన్‌ పౌరులుగా మారారు. తర్వాత ఇండియా (65,960), ఫిలిప్పీన్స్‌ (53,413), క్యూబా (46,913), డొమినికన్‌ రిపబ్లిక్‌ (34,525), వియత్నాం (33,246), చైనా (27,038) ఉన్నాయి. 2023 నాటికి గ్రీన్ కార్డు లేదా లీగల్‌ పర్మినెంట్‌ రెసిడెన్సీ ఉన్న 2,90,000 మంది భారతీయులు సహజీకృత పౌరసత్వం పొందే అవకాశం ఉందని అమెరికా పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news