కలిసి ఫొటో దిగినంత మాత్రానా భార్యాభర్తల మధ్య అంతా సవ్యంగా ఉందని కాదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని ఒక ఫొటో ఆధారంగా నిర్ధరించలేమని అభిప్రాయపడింది. తమకూరుకు చెందిన మహిళ విడాకుల పిటిషన్పై దర్యాప్తు చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి వేడుకలో పాల్గొన్న దంపతులు ఫొటో దిగినంత మాత్రాన వారి మధ్య బంధం బాగానే ఉందని అర్థం కాదని ధర్మాసనం పేర్కొంది. ఫొటోను బట్టి దంపతుల మధ్య ఉన్న సంబంధాలపై స్పష్టతకు రావడం కుదరదని స్పష్టం చేసింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ మహిళకు తన భర్తతో విడాకులు మంజూరు చేసింది హైకోర్టు.
పిటిషనర్ (విడాకులు కోరుతున్న మహిళ) భర్త .. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. ఆమె ఫోన్ కాల్స్ చెక్ చేసేవాడు. మహిళపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో 2017లో మహిళ భర్తను వదిలిపెట్టి బెంగళూరులోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయి ఆ తర్వాత ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోసం దరఖాస్తు చేసుకుంది. 2018లో దంపలిద్దరూ ఒక వివాహానికి హాజరై కలిసి ఫొటో దిగారని, వారిద్దరూ సంతోషంగా ఉన్నారని భర్త తరఫు న్యాయవాది ఫ్యామిలీ కోర్టులో వాదించారు. దంపతులకు విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదని, విడాకులపై దాఖలైన పిటిషన్ను కొట్టివేయాలని కోరగా.. ఫ్యామిలీ కోర్టు మహిళ విడాకుల పిటిషన్ను కొట్టివేసింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.