కోవిడ్ టీకాలను తీసుకునేందుకు ప్రజలు ఆధార్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్న విషయం విదితమే. ఆధార్ కార్డులతో ముందుగా కోవిన్ యాప్ లేదా ఆరోగ్య సేతు యాప్, కోవిన్ పోర్టల్‌లలో రిజిస్టర్ చేసుకున్న తరువాత ఆ వివరాలతో టీకా కేంద్రాలకు వెళ్లి టీకాలను వేయించుకోవాలి. అయితే ఆధార్ లేదని చెప్పి టీకాలను ఇవ్వడం నిరాకరించరాదని, అలాగే ఆధార్ లేకపోతే కోవిడ్ సేవలను అందించలేమని చెప్పకూడదని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఈ మేరకు యూఐడీఏఐ ఒక ప్రకటన విడుదల చేసింది.
కోవిడ్ టీకాలను తీసుకునేందుకు ఆధార్ అవసరమే. అయితే అది తప్పనిసరి కాదు. ఆధార్ లేదని చెప్పి టీకాలను ఇవ్వలేం.. అని కేంద్రాల సిబ్బంది అనకూడదు. అలాగే ఆధార్ లేకపోతే కోవిడ్ సేవలను అందించలేము.. అని కూడా సిబ్బంది చెప్పరాదు. ఆధార్ లేకపోతే పాన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను కూడా ఐడీ ప్రూఫ్ కింద చూపించవచ్చు.. అని యూఐడీఏఐ తెలియజేసింది.
కాగా చాలా చోట్ల ఆధార్ లేనివారికి, ఆధార్‌ను తీసుకెళ్లని వారికి టీకాలను వేయడం లేదని అలాగే కోవిడ్ బాధితులకు వైద్య సేవలను అందించడం లేదని యూఐడీఏఐ దృష్టికి వచ్చింది. అందుకనే యూఐడీఏఐ పై విధంగా ప్రకటన చేసింది. అందువల్ల ఎవరైనా సరే ఆధార్ లేకపోయినా మిగిలిన పత్రాలను ఐడీ ప్రూఫ్ కింద చూపించి టీకాలను వేయించుకోవచ్చు. అలాగే కోవిడ్ వైద్య సేవలను పొందవచ్చు.