చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని తీసుకువెళ్లి ఇస్రో ప్రపంచంలోనే భారత్‌ను జాబిల్లిపై అడుగుపెట్టిన తొలి దేశంగా పేరు తీసుకువచ్చింది. ఇప్పుడు ఇస్రో తన ఫోకస్ సూర్యుడిపై పెట్టింది. ఇందులో భాగంగానే.. పీఎస్‌ఎల్‌వీ-సీ57 వాహక నౌక ద్వారా ఇస్రో శనివారం ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) సిద్ధమైంది.
ప్రయోగానికి ముందు 24 గంటలపాటు కౌంట్ డౌన్ నిర్వహించనున్నారు. ఇది ఈరోజు మధ్యాహ్నం 11.50 గంటలకు ప్రారంభం కానుంది. నిరంతరాయంగా కొనసాగిన పిదప శనివారం మధ్యాహ్నం 11.50 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది. ఈ మేరకు లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్) సమావేశంలో బోర్డు ఛైర్మన్ రాజరాజన్ ప్రయోగానికి పచ్చ జెండా ఊపారు. ఇస్రో అధిపతి డా.సోమనాథ్ గురువారం రాత్రి షార్‌కు వచ్చారు. ఆయన మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.