ఎన్నికల్లో తమకు 80కి 80 సీట్లు వచ్చినా ఈవీఎంలపై నమ్మకం కలగదని ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్ అన్నారు. వాటిపై తనకు ఎప్పుడూ నమ్మకం లేదని తెలిపారు. ఈవీఎంల సమస్య ఇంకా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతోన్న చర్చలో అఖిలేశ్ యాదవ్ పేపర్ లీక్, ఈవీఎంలు, అయోధ్య ఎన్నికల ఫలితాలు, ఉత్తర్‌ప్రదేశ్‌లో అవినీతి గురించి మాట్లాడారు.
‘‘ఎన్నికల సమయంలో 400 సీట్లు అంటూ వారు ప్రచారం చేశారు. కానీ ప్రజలు మాకు నైతిక విజయం కట్టబెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువకాలం ఉండదని అంతా చెప్తున్నారు. వ్యక్తిగత లక్ష్యాల ఆధారంగా దేశాన్ని నడిపించలేరు’’ అని భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతోన్న అవినీతి గురించి మాట్లాడుతూ.. అభివృద్ధి పేరిట దోపిడీ జరుగుతోందన్నారు. ఒకప్పుడు తాము నిర్మించిన రోడ్లపై విమానాలు దిగాయని, కానీ ఇప్పుడు ప్రధాన నగరంలో పడవలు తిరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇదేం స్మార్ట్ సిటీ?” అంటూ ప్రభుత్వ పథకాలపై విమర్శలు గుప్పించారు.