ఇటీవల చాలా ప్రాంతాల్లో కోతుల బెడద ఎక్కువవుతోంది. కోతుల వల్ల పలు ప్రాంతాల్లో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఓ 13 ఏళ్ల బాలిక మాత్రం కోతుల గుంపు చుట్టుముట్టినా భయపడిపోలేదు. సమయస్ఫూర్తితో ఆలోచించి ఆ ప్రమాదం నుంచి బయటపడింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తనను తాను కాపాడుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో నివాసముంటున్న నిఖిత (13) అనే బాలిక.. తన మేనకోడలు వామిక (15నెలలు) తో కలసి ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఓ కోతుల గుంపు ఇంట్లోకి ప్రవేశించింది. గందరగోళాన్ని సృష్టించడంతో పాటు ఓ కోతి నికిత, తన మేనకోడలు వద్దకు వచ్చింది. ఆ సమయంలో నిఖిత సమయస్ఫూర్తితో ఆలోచించి వెంటనే ఇంట్లో ఉన్న వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సాను ‘‘అలెక్సా.. శునకంలా మొరుగు’’ అని ఆదేశించింది. వెంటనే అలెక్సా పెద్దగా మొరిగే కుక్క శబ్దాలు చేయడం ప్రారంభించడంతో భయపడిన కోతులు అక్కడినుంచి పారిపోయాయి. నిఖిత సమయస్ఫూర్తికి ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఈ విషయం తెలిసినవారంతా ఆశ్చర్యపోయారు. ఆ 13 ఏళ్ల బాలిక ధైర్యాన్ని, తెలివిని పొగిడారు.