దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు శుక్రవారం రోజున ప్రారంభమైన అమరనాథ్ యాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. జమ్మూలోని భాగవతి నగర్ క్యాంపు నుంచి మొదటి బృందం యాత్రను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. 4 వేల 400 మందితో కూడిన రెండో బృందం కూడా హిమలింగం దర్శనానికి పయనమైంది. మొత్తంగా జమ్మూ బేస్ క్యాంప్ నుంచి 7 వేల 904 మంది భక్తులు అమరనాథున్ని దర్శించుకునేందుకు పయనమయ్యారు.
62 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల పొడవైన నునవాన్-పహల్గామ్ మార్గంతో పాటు గందేర్బల్ జిల్లాలోని 14 కిలోమీటర్ల పొడవైన బల్తల్ మార్గంలోనూ సాగుతోంది. ఈ యాత్ర కోసం ఇప్పటి వరకు దాదాపు 3.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఆ సంఖ్య మరింత పెరగొచ్చని వెల్లడించారు. అమర్‌నాథ్ యాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాత్రలో పాల్గొనే భక్తుల రిజిస్ట్రేషన్ కోసం ఐదు కౌంటర్లు ఏర్పాటు చేశారు.