‘బొగ్గే కదా అని కొందరు అనుకుంటారు.. కానీ ఆ బొగ్గు అగ్గిరాజుకుంటే అంతా భస్మం కావాల్సిందే.. నేనూ అలాంటి బొగ్గునే’ అంటూ డీహెచ్ శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రోజున ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. పాల్వంచలో కుటుంబ సమేతంగా.. అభిమానుల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. తన జన్మదినం సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కటౌట్లు, బ్యానర్లను కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపించారు.
రామాయణంలో ఉన్నట్టుగానే నియోజకవర్గంలోనూ ఓ రావణాసురుడు ఉన్నాడంటూ ఓ ప్రజాప్రతినిధి తనయుడిని ఉద్దేశించి డీహెచ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చూసేందుకు నల్లగా ఉందని సింగరేణి బొగ్గును తక్కువ అంచనా వేయొద్దని, నిప్పంటిస్తే అగ్గిరాజుకుంటుందని గుర్తించాలన్నారు. తనను తక్కువ చేసి చూసేవారు దీన్ని గమనించాలన్నారు. ఓ స్థానికుడిగా ప్రజలకు చేతనైన సేవ చేస్తుంటే కొందరు వ్యక్తులు అడ్డు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నాయకత్వం వల్ల నియోజకవర్గంలో తగినంత అభివృద్ధి జరగలేదని.. కొత్త నాయకత్వంలో ఆశించిన మార్పు సాధించుకుందామని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ‘గడపకు గడపకు గడల.. ఇంటికి కొడుకులా’ అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు.