ఉక్రెయిన్‌తో వివాదాన్ని చర్చలు, దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. అమెరికా పర్యటన నుంచి ఇటీవల తిరిగి వచ్చిన మోదీ శుక్రవారం రోజున పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఉక్రెయిన్ పోరు, వాగ్నర్ గ్రూప్ సాయుధ తిరుగుబాటు, భారత్-రష్యా వాణిజ్య, వ్యూహాత్మక భాగస్వామ్యాలు.. వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.
వర్చువల్‌గా జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశానికి ఈనెల 4న భారత్ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో ఈ ఫోన్ సంభాషణ జరగడం గమనార్హం. ఇరువురు నేతల చర్చలపై క్రెమ్లిన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో వాషింగ్టన్ పర్యటన వివరాలను పుతిన్‌తో ప్రధాని మోదీ పంచుకున్నట్లు పేర్కొంది. దౌత్యమార్గాల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఉక్రెయిన్ తిరస్కరిస్తున్న విషయాన్ని మోదీ దృష్టికి పుతిన్ తీసుకొచ్చారని తెలిపింది.