నిజ్జర్‌ హత్య దర్యాప్తునకు భారత్‌ సహకరించాలి.. కెనడా ఆరోపణలపై అమెరికా

-

ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌హత్యతో భారత్‌, కెనడా మధ్య అగ్గిరాజుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిజ్జర్‌ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చన్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై తాజాగా అమెరికా స్పందించింది. నిజ్జర్‌ హత్యపై కెనడా దర్యాప్తునకు భారత్‌ సహకరించాలని సూచించింది.

నిజ్జర్ హత్యతో భారత్‌ ఏజెంట్లకు సంబంధం ఉందంటూ వచ్చిన ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా పేర్కొంది. ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టేందుకు ఒట్టావా చేస్తున్న ప్రయత్నాలకు మేం మద్దతిస్తున్నామని… పారదర్శకమైన, సమగ్ర దర్యాప్తుతోనే నిజానిజాలేంటో అందరికీ తెలుస్తాయని విశ్వసిస్తున్నామని వ్యాఖ్యానించింది. అందుకే, ఎలాంటి దర్యాప్తుకైనా భారత అధికారులు సహకరించాలని కోరుతున్నామని శ్వేతసౌధం జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్‌ కెర్బీ అన్నారు.

ఇటీవల అమెరికా నిపుణులు మాత్రం భారత్- కెనెడాల మధ్య వివాదంలో అమెరికా నేతలు తలదూర్చొద్దని అన్నారు. ఆ వివాదంలో వేలు పెట్టడం మంచిదికాదని.. అలాగే కెనడా-భారత్​ల వివాదాన్ని ఉద్దేశిస్తూ నిప్పుతో చెలగాటమాడొద్దని కెనడాకు అమెరికా నిపుణులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news