నిజ్జర్‌ హత్య దర్యాప్తులో కెనడాకు సహకరించాలన్న అమెరికా.. భారత్​కు మద్దతుగా శ్రీలంక

-

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వ్యవహారం కెనడా భారత్​ల మధ్య దౌత్య పరమైన ఉద్రిక్తతలు కలిగించింది. ఈ ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే కెనడా-భారత్​ల వివాదంపై అమెరికా పూటకో మాట మాట్లాడుతోంది. తాజాగా నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో కెనడాకు సహకరించాలని భారత్‌కు అమెరికా విజ్ఞప్తి చేసింది.

నిజ్జర్‌ హత్యలో భారత్‌ హస్తం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే జస్టిన్ ట్రూడో భారత్​పై ఆరోపణలు చేయడంపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తెలిపారు. ఈ అంశంపై కెనడాతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. ఈ కేసులో కెనడా చేస్తున్న విచారణతో పాటు నేరస్థులను న్యాయస్థానం ముందుకు తీసుకురావడం అనే రెండు ప్రక్రియలు సంక్లిష్టమైనవని తాము భావిస్తున్నామని మాథ్యూ చెప్పారు. కేసు దర్యాప్తులో కెనడాకు సహకరించాలని బహిరంగంగానూ, ప్రైవేట్‌గానూ భారత ప్రభుత్వాన్ని తాము కోరుతున్నామని వెల్లడించారు.

మరోవైపు, ఈ వివాదంపై భారత్‌కు శ్రీలంక మద్దతు పలికింది. కెనడా ఆరోపణలకు భారత్‌ దృఢంగా, ప్రత్యక్షంగా ప్రతిస్పందించిందని పేర్కొంది. తమ దేశం ఏళ్ల తరబడి ఉగ్రవాదంతో ఎంతో నష్టపోయిందని.. అందుకే ఈ విషయంలో న్యూదిల్లీకే మద్దతు ఇస్తామని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news