పాకిస్థాన్‌తో చర్చలు జరిపేదే లే : అమిత్‌ షా

పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తుందని తెలిపారు. జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్న షా.. రెండో రోజు  బారాముల్లాలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడారు. జమ్ముకశ్మీర్‌ని దేశంలోనే అత్యంత శాంతియుతమైన ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

‘‘పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని కొందరు చెబుతున్నారు. పాకిస్థాన్‌తో మనం ఎందుకు చర్చలు జరపాలి? అది జరగని పని. మేం బారాముల్లా ప్రజలతో మాట్లాడతాం. జమ్ముకశ్మీర్‌ ప్రజలతో మాట్లాడతాం’’ అని అమిత్ షా అన్నారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని సహించబోదని, జమ్ము కశ్మీర్‌ను దేశంలోనే శాంతియుత ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్ని గ్రామాలకు విద్యుత్‌ సదుపాయం ఉందని అమిత్‌ షా అక్కడున్న వారిని ప్రశ్నించారు. గత మూడేళ్లలో కశ్మీర్‌లోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ అందించామని అమిత్ షా చెప్పారు.