ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. దాదాపు ఆలయ నిర్మాణం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబరు నాటికి మందిరం మొదటి ఫ్లోర్ నిర్మాణం పూర్తవుతుందని రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు.. చివరి దశలో ఉన్నాయని వెల్లడించారు.
మూడంతస్తుల ఆలయ నిర్మాణంలో భాగంగా.. రాజస్థాన్‌లోని బన్సీ పహడ్పుర్ నుంచి తెచ్చిన రాతిని అమర్చే ప్రక్రియ సాగుతోందని మిశ్రా తెలిపారు. రామ మందిరంలో గర్భగుడితోపాటు గుధ్ మండపం, రంగ మండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం అనే ఐదు మండపాలు ఉంటాయని చెప్పారు. గర్భగుడి మొత్తాన్ని మక్రానా పాలరాతి స్తంభాలతో నిర్మిస్తున్నామని.. బరువు, వాతావరణపరంగా ఎదురయ్యే సవాళ్లను పరిగణలోకి తీసుకుని ఆలయం మొత్తంలో 392 స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఆలయం మొత్తం వైశాల్యం 8.64 ఎకరాలు. వచ్చే ఏడాది జనవరి కల్లా భక్తుల దర్శనార్థం రామ మందిరాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ భావిస్తున్నట్లు చెప్పారు.