తమిళనాడులో భారీ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారు. మైసూర్ నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్భాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్ ప్రెస్ రైలు (12578) వేగంగా వచ్చి తిరువల్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో ఒక్కసారిగా గూడ్స్ రైలును ఢీ కొట్టింది. దాదాపు 13 బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని చెల్లచెదురుగా పడగా.. మరికొన్ని ఒకదానిపైకి మరొకటి ఎక్కాయి. అదృష్టవశాత్తు ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది.
ఈ ప్రమాదం చోటు చేసుకోగానే సమీప గ్రామాల ప్రజలు, పలు శాఖల సహాయక సిబ్బంది సకాలంలో చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గూడ్స్ రైలును ఢీ కొన్నప్పుడు ముందు భాగంలో అన్నీ ఏసీ కోచ్ లే ఉండటంతో వాటిలో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. ఏసీ కోచ్ లు కాకుండా సాధారణ కోచ్ లు ఉంటే మాత్రం.. ప్రమాదం తీవ్రతరంగా ఉండేది. చెన్నై రైల్వే డివిజన్ 044 2535 4151 044 2435 4995 ఫోన్ నెంబర్లతో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసినట్టు తెలిపింది.